అక్షింతలు ఎలా తయారు చేయాలి? అక్షింతల ప్రాముఖ్యత ఏమిటి?
అక్షింతలు ఎలా తయారు చేయాలి అనే విషయం తెలుసుకునే ముందు, మన హిందూ సంప్రదాయంలో అక్షింతలకు ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ అక్షింతలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
పుట్టినరోజున మన ఇంట్లోని పెద్దవాళ్లు మనల్ని ఆశీర్వదించేటప్పుడు, పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు, బారసాల, అన్నప్రాసన, నామకరణం వంటి ఎన్నో సందర్భాల్లో అక్షింతలను ఉపయోగిస్తుంటాం.
అసలు అక్షింతలు ఎలా తయారు చేయాలి? వాటికి ఎలాంటి బియ్యం ఉపయోగించాలి? ఆశీర్వదించేటప్పుడు అక్షింతలను ఎందుకు వేస్తారు? తెలుసుకుందాం.
అక్షింతలు అంటే ఏమిటి?
మన సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, ఆ సందర్భంలో ఉపయోగించే అక్షింతలకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది.
వీటిని పూర్వం “అక్షతలు” అనేవారు. అంటే క్షయం కానివి, పరిపూర్ణమైనవి అని అర్థం. ఇప్పుడు ఆ “అక్షతలు” అనే పేరునే సాధారణంగా “అక్షింతలు” అని వాడుతున్నాం.
మన సంప్రదాయంలో శుభకార్యాల్లో పెద్దలు తలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. పూజలో కూడా దేవుని పూజించడానికి అక్షింతలను ఉపయోగిస్తాం.
అక్షింతలు తయారు చేయడానికి కావలసినవి
అక్షింతలు తయారు చేయడానికి ముఖ్యంగా కావలసినవి:
బియ్యం + పసుపు + ఆవు నెయ్యి
సువాసన కోసం చందనం, పన్నీరు (Rose Water) లేదా మరికొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగిస్తుంటారు.

అక్షింతలు ఎలా తయారు చేయాలి?
బియ్యంలో పసుపు మరియు ఆవు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
కొంతమంది నీళ్లు కలిపి కూడా అక్షింతలు తయారు చేస్తుంటారు. మన పద్ధతిలో మాత్రం ఆవు నెయ్యితో అక్షింతలను కలుపుకుంటాం.
సువాసన కావాలనుకుంటే చందనం లేదా పన్నీరు (Rose Water) వంటి వాటిని కూడా కలుపుకోవచ్చు.
⭐ అక్షింతలకు ఎలాంటి బియ్యం తీసుకోవాలి?
ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.
అక్షింతలకు విరగని పూర్తి బియ్యం తీసుకోవాలి.
ముక్కలుగా విరిగిపోయిన బియ్యం, నూక లేదా రవ్వలాగా ఉన్న బియ్యాన్ని తీసుకోకుండా, సాధ్యమైనంత వరకు పూర్తి గింజలుగా ఉన్న బియ్యాన్ని ఎంచుకోవాలి.

ముఖ్యమైన చిట్కా
:అక్షింతలు తయారు చేసేటప్పుడు విరగని పూర్తి బియ్యాన్ని ఎంచుకోండి.
భద్రాచలం సీతారామ కళ్యాణం – బియ్యానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా.
అటువంటి సమయంలో కొన్ని జిల్లాల నుంచి ధాన్యాన్ని చేత్తో పొట్టు తీసి, ఆ బియ్యాన్ని సీతారామ కళ్యాణానికి పంపించేవారని చెబుతారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి అలాగే పంపిస్తున్నారని కూడా చెబుతుంటారు.
అందుకే అక్షింతలకు తీసుకునే బియ్యం విషయంలో విరగని పూర్తి బియ్యానికి ప్రాముఖ్యత ఇస్తారు.
🌙 అక్షింతల్లో బియ్యం ఎందుకు ఉపయోగిస్తారు?
సంప్రదాయంగా బియ్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతారు.
“మనః కారకో ఇతి చంద్రః” — అంటే చంద్రుడు మనసుకు కారకుడు లేదా అధిపతి అని భావిస్తారు.
అందుకే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చిహ్నంగా బియ్యాన్ని ఉపయోగిస్తారని చెబుతారు.
పసుపు ఎందుకు కలుపుతారు?
పసుపును గురువుకు ప్రతీకగా భావిస్తారు. గురు గ్రహాన్ని శుభగ్రహంగా భావిస్తారు.
అందుకే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలతో ఆశీర్వదిస్తారని సంప్రదాయంగా చెబుతారు.
అక్షింతలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు?
మన సంప్రదాయంలో అక్షింతలను:
పూజలు • వ్రతాలు • పెళ్లిళ్లు • బారసాల • అన్నప్రాసన • నామకరణం • ఇతర శుభకార్యాల్లో
ఉపయోగిస్తుంటాం.
పూజలో పువ్వులు అందుబాటులో లేకపోయినా లేదా కొన్ని సమర్పణల సమయంలో కూడా అక్షింతలను ఉపయోగించే సంప్రదాయం ఉంది.
🎥 అక్షింతలు ఎలా కలపాలో వీడియోలో చూడండి
https://youtu.be/iCmMMB8NfkM
Videoలో అక్షింతలు కలిపే విధానాన్ని step-by-stepగా చూడవచ్చు.
చివరిగా…
మన ఇళ్లలో తరతరాలుగా కొనసాగుతున్న చిన్న చిన్న సంప్రదాయాల వెనుక కూడా ఎన్నో విషయాలు ఉంటాయి.
అక్షింతలు తయారు చేసేటప్పుడు ముఖ్యంగా విరగని పూర్తి బియ్యం, పసుపు మరియు ఆవు నెయ్యి ఉపయోగించడం గుర్తుంచుకోండి.
Indian Spice Soulలో నేను స్వయంగా చేసే వంటలు, kitchen tipsతో పాటు మన ఇళ్లలో ఉపయోగపడే ఇలాంటి సంప్రదాయ విషయాలను కూడా మీతో పంచుకుంటాను.
